తెలంగాణలో ఆర్థికమంత్రి ఎవరు? మల్లు భట్టి విక్రమార్కనా? లేక మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా? అని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బక్క జడ్సన్ ప్రశ్నించారు. ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ… రైతుబంధు నిధుల మళ్లింపుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాస్తే ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ కట్ చేసి డబ్బులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇటీవల బీ ట్యాక్స్ గురించి మాట్లాడారని గుర్తు చేస్తూ.. దీనిని మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు చిన్న చిట్టిపై రాస్తారని… ఆ చిట్టీని తీసుకువెళ్లి రామకృష్ణకు ఇస్తే (ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) ఆ బిల్లు అప్పుడు అకౌంట్లలో పడతాయని ఆరోపించారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ కట్టయ్యాక బిల్లులు పడతాయన్నారు. అందుకే ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? అని ప్రశ్నిస్తున్నానన్నారు. రైతుబంధు కోసం విడుదలైన రూ.7500 కోట్లు ఎలా డైవర్ట్ అయ్యాయో… ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
జీవోలు పేదల కోసం ఉండాలని.. బడాబాబుల కోసం కాదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తనను సస్పెండ్ చేయడం ద్వారా తనపై ప్రతాపం చూపించారని మండిపడ్డారు. మేఘా కృష్ణారెడ్డి జీఎస్టీ ఎగ్గొడితే తాను ఐటీకీ, ఈడీకి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఆయనను ఎందుకు ముట్టుకోలేదో చెప్పాలని బీజేపీ నేతలను కూడా నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్… ఇలా ఒక్క పార్టీ నాయకులు కూడా అసెంబ్లీ సమావేశాల్లో మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు.