కడప జిల్లా : కడప పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అచ్చన్న ఈనెల 12 నుంచి కనిపించకుండా పోయారని ఆయన కుమారుడు క్లింటన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 8 నెలలుగా పశుసంవర్ధక శాఖలో అక్కడ పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది కి, మా తండ్రికి శాఖా పరమైన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నా తండ్రి ఎవరికీ చెప్పకుండా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని తన తండ్రి ఆచూకీ తెలియజేయాలని కోరారు.