కారంచేడు మారణకాండకు నేటితో 38 ఏళ్లు. 1985 జులై 17న ఈ ఘటన జరిగింది. రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన ఘటన కారంచేడు.
తెలుగు నేల మీద జరిగిన ప్రధాన దాడులు కారంచేడు, చుండూరు.. రెంటిలోనూ పారిన నెత్తుటికి నీటి పారుదల కాల్వలు సాక్ష్యంగా ఉండడం సామాజిక పరిణామంలో కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది.ఘటన జరిగి నేటికి సరిగ్గా 38 సంవత్సారాలు. అగ్రకుల ఆధిపత్య వర్గాలు, భూస్వామ్య పెత్తందారీ వర్గాలు.. కుల ఆధిపత్యం ప్రదర్శించి, అణగారిన వర్గాలకు/బలహీన వర్గాలకు చెందిన మాదిగ పల్లె పై,. మానవత్వమన్నదే మరచి, విచక్షణా రహితంగా మూకుమ్మడిగా దాడికి, దౌర్జన్యానికి పాల్పడి.. పదుల సంఖ్యలో అమాయక మాదిగ సోదరులను పొట్టనబెట్టుకున్న దారుణ, దుర్మార్గ పరిస్థితి. అప్పట్లో ఆ మారణ కాండ.. దేశంలోనే పెను సంచలనం సృష్టించినట్లుగా చరిత్రకారులు చెపుతారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఎలాఉన్నా.. ఈ అనైతిక, అనాగరిక, అప్రజాస్వామిక మారణకాండ తరువాత.. సమాజం ఏం గుణపాఠం నేర్చిందని అరా తీస్తే.. తరువాత కాలంలో కూడా మరింతా ఆటవిక, అనాగరిక సమాజంగానే వుండిపోయింది తప్పా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదనే చెప్పవచ్చు. తరువాతి కాలంలో 1991 లో చుండూరు, పాదిరి కుప్పం, వెంపేట, వాకపల్లి, లక్షింపేట ఇలా వరుస దారుణాలు, దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడవి రూపం మార్చుకొని మరింతగా కొత్తపుంతలు తొక్కుతున్నట్లు తెలుస్తోంది.