కరీంనగర్ జిల్లా: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గత శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా ఉన్న ఎల్ సుబ్బరాయుడుని బదిలీ చేయగా వారి స్థానంలో 2011 ఐపిఎస్ బ్యాచ్ కి చెందిన అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. రాచకొండ ట్రాఫిక్ డీసీపీ గా పనిచేస్తున్న ఆయన బదిలీపై వచ్చి మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కమిషనరేట్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పాటించాల్సిన నియమాలు చేయవలసిన విధుల గురించి ఆయన అధికారులకు పలు సూచనలు చేసారు. జిల్లాలో నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని అమలు చేసేలా విధులు నిర్వర్తించాలన్నారు. రౌడీ షీటర్లపై , ఎన్నికల వేళ గొడవలు సృష్టించే వ్యక్తులపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తుల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి వారిని సంబంధిత అధికారుల ముందు బైండోవర్ చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిస్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నియామాయావళిని అమలు పరచాలన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణముగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తగిన కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.