కర్ణాటక : భారత పర్యటనలో భాగంగా కర్ణాటకకు వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. తనకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో పాటు మరికొందరు టూరిస్టులతో కలిసి స్టార్ గేజింగ్ (నక్షత్రాలను పరిశీలించడం) కు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఓ కాలువ ఒడ్డున కూర్చుని ఉన్న టూరిస్టులలోని పురుషులను ముందుగా కాలువలోకి తోసేశారు. అనంతరం ఇజ్రాయెల్ టూరిస్టుతో పాటు అతిథి గృహం యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని కొప్పల్ లో చోటుచేసుకుందీ ఘోరం.
బాధితులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొప్పల్ కు చెందిన 29 ఏళ్ల మహిళ హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. గురువారం రాత్రి టూరిస్టుల అభ్యర్థన మేరకు స్టార్ గేజింగ్ కోసం వారిని సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు తీసుకెళ్లింది.
వారంతా కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మరో టూరిస్టు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో టూరిస్టు కాలువలో గల్లంతయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన టూరిస్టు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.