జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు కార్మికులను ఉగ్రవాదులు మంగళవారం హతమార్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకోవడానికి పోలీసులు సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ నిర్వహించారు.ఇందులో నిషేధిత సంస్థ లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ‘హైబ్రిడ్ ఉగ్రవాది’అరెస్టు చేశారు.
మంగళవారం తెల్లవారుజామున షోపియాన్లోని హర్మెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ ను విసరడంతో ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ కు చెందిన ఇద్దరు కూలీలను గాయపడ్డారని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించామని, అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వారు చనిపోయారని పేర్కొన్నారు. మృతులను మోనిష్ కుమార్, రామ్ సాగర్ లుగా పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్ సందర్భంగా గ్రెనేడ్ విసిరిన లష్కరే తోయిబాకు చెందిన హైబ్రిడ్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ”నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్మెన్ షోపియాన్ కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఇమ్రాన్ బషీర్ గనీ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు కార్మికులపై గ్రెనేడ్ ను విసిరాడు. దీనిపై తదుపరి దర్యాప్తు, దాడులు జరుగుతున్నాయి ” అని ఆయన పేర్కొన్నారు.