హైదరాబాద్: ఈ రోజు అసెంబ్లీలో సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు గారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో జరిగిన ఒక అంశంపై చర్చ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, 2002-2004 మధ్య సిర్పూర్ మాజీ శాసన సభ్యురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి గారు 2,000 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టాలు ఇచ్చిన విషయం గుర్తుచేశారు.
2014 వరకు ఈ భూమి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే, 2014 తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఫారెస్ట్ అధికారులు ఈ భూమిని ఫారెస్ట్ భూమిగా ప్రకటించి, పోడు రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పట్టు హక్కులున్న భూమిపై రైతులను వేధించడంతో పాటు, ఫారెస్ట్ అధికారులు చెట్లు నాటినట్లు ఆరోపించారు.
“ఈ భూమిపై పోడు రైతులకు 2021లో మద్దతుగా నిరాహార దీక్ష చేసినప్పుడు, నన్ను మరియు 60 మంది రైతులను రిమాండ్ చేసి 40 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉంచారు. ఈ పోడు రైతుల ఉసురు నేడు బిఆర్ఎస్ ప్రభుత్వానికి తీవ్రమైన మచ్చగా మారింది,” అని డా. హరీష్ బాబు వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పోడు రైతులపై దాఖలు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఫారెస్ట్ అధికారులు చేస్తున్న అత్యుత్సాహాన్ని తీవ్రంగా ఖండించి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.