కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: మహనీయుల చరిత్రను భావితరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొని వడ్డెర కుల సంఘ నాయకులు, ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒడ్డే ఓబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో రేనాడు ప్రాంతంలో 1816 సంవత్సరం జనవరి 11వ తేదీన జన్మించి, 18 వ శతాబ్దంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఆనాడు సంచార జాతులైన వడ్డెరలు, బోయలు, చెంచులు వంటి జాతులకు నాయకత్వం వహిస్తూ నల్లమల ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్యాలను ఎదుర్కొని తన జాతులను కాపాడుకున్న మహనీయుడు అని కొనియాడారు. ఓబన్న దేశంలోని బహుజనులందరికీ గర్వకారణమని, ప్రభుత్వం ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, వడ్డెర కుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
