కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లాలో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ పాఠశాలలు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షా విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష కొరకు జిల్లాలోని ఎంపిక చేయబడిన పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు కార్యచరణ ప్రకారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగిందని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు.