కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల వివరాలను పరిశీలించి ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, విద్యుత్, వెలుతురు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి వరసలో నిలబడి ఉన్న వారికి చిట్టీలు అందించి వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
