ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్తవారికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారు. టీ-పీసీసీ అధ్యక్ష పదవిపై పలువురు సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది.