బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని… ఆ సమయంలో ఏం జరిగినా బీఆర్ఎస్‌కే మేలు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారన్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుందన్నారు. కాంగ్రెస్‌పై అప్పుడే తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. రానున్న రోజులు మనవేనని… పార్లమెంట్‌లో మన గళం వినిపించాలన్నారు.
మనం రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్నారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్‌కు నష్టం ఏమీ లేదన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఉదయం 11 గంటల వరకు పొలంబాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు నుంచి మూడు చోట్ల రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్‌లో లక్షమందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.