తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చిల్లర రాజకీయాలకు ఇచ్చినంత ప్రాధాన్యతను ప్రజా కార్యక్రమాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణలోని ప్రజలంతా ఎంతో ఆగ్రహంగా ఉన్నారని… లోక్ సభ ఎన్నికల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని, కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు. ప్రజాగ్రహం కాంగ్రెస్ పార్టీని ముంచేస్తుందని అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రాకరాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పిచ్చి పనులు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసిందని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరని… అలా చెపితే ఆ రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పారు. ఇది రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా వీరు స్వల్ప రాక్షసానందం పొంది ఉండొచ్చని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రమని తాను ప్రకటించానని… అదే విషయాన్ని బీఆర్ఎస్ పాలనలో రుజువు చేశామని కేసీఆర్ తెలిపారు. బంగారు తెలంగాణ అని చెపుతూ… ఆ దిశగా తాము అడుగులు వేశామని చెప్పారు.
రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీశారు. ఆగస్ట్ 15న రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ చెపుతున్నారని… ఏ ఆగస్టు 15వ తేదీకి రైతు రుణమాఫీ చేస్తారో చెప్పాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద తిట్లు, దేవుళ్ల మీద ఒట్లు తప్ప కాంగ్రెస్ పాలనలో ఏం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వ్యవసాయ రంగానికి శాపంగా మారిందని చెప్పారు.