బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ను ఏర్పాటు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదే అంశంపై తొలుత హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి కమిషన్ ను ఏర్పాటు చేయడం… కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952, విద్యుత్తు చట్టం 2003కి విరుద్ధమని తన పిటిషన్ లో కేసీఆర్ పేర్కొన్నారు. కమిషన్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే… దాన్ని తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలని… దానిపై విచారించే అధికారం కమిషన్ కు లేదని పిటిషన్ లో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించనుంది.