ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ లో రూ. 6,100 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయన హాజరవుతారా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. 2021 సెప్టెంబర్ వరకు మోదీతో, కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తేడాలు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.
ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణకు మోదీ పలుమార్లు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్ ను ఆహ్వానించినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా హాజరుకాలేదు. అన్ని సందర్భాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి ఆహ్వానం పలికి, వీడ్కోలు పలికేవారు. అయితే గత కొంత కాలంగా బీజేపీపై కేసీఆర్ విమర్శలు తగ్గించారు. దీంతో, మోదీ పర్యటనకు కేసీఆర్ హాజరవుతారా? అనే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.