హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన విచారకరం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేశారు.ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోంది.ఫైర్ సేఫ్టీ పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులకు చెబుతున్నామని, అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.ఈ ప్రమాదంలో బయటికి రాలేక ఆరుగురు 5 అంతస్తులోనే చిక్కుకుని మరణించిన సంగతి తెలిసిందే. వారంతా క్యూనేట్ అనే సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసిందన్న ఆయన ఆ సంస్థపై ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయం కాకుండా యూనిట్ నుంచి కూడా బాధితులకు సాయమందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదాలు అన్నీ 40 ఏళ్ల నాటివని ఈ క్రమంలో పాత బిల్డింగులు ఫైర్ సేఫ్టీ లేని భవనాలు సుమారుగా 30 లక్షల దాకా ఉన్నాయని తెలిపారు.వీటిపై చర్యలు తీసుకునే క్రమంలో ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ.. ప్రమాద ఘటన పై ఒక కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయన్న ఆమె..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.