- ఏడు పిల్లర్లు కుంగిపోతే ఏమైతదని అనే స్థాయికి చేరారంటూ మండిపాటు
CPI Narayana: మేడిగడ్డ బ్యారేజీలో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిని నిర్మించినపుడు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని పట్టించుకోకుండా గృహ ప్రవేశం చేస్తామా.. భయపడతామా? అని ప్రశ్నించారు. ఈమేరకు గురువారం పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టులో నీళ్లు నిండాక ఒక్క పిల్లర్ కుంగినా ప్రమాదమే కదా అని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేడిగడ్డ సందర్శన యాత్రకు పిలిచినపుడు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని నారాయణ ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుకు పగుళ్లు వస్తే వెళ్లి చూడాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం పిలిచినపుడైనా వెళ్లి అక్కడే కౌంటర్ ఇవ్వాల్సింది.. లేదా తప్పు జరిగితే ఒప్పుకోవాల్సిందని కేసీఆర్ కు హితవు చెప్పారు.
అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఏ సభ్యుడైనా సరే సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నారాయణ చెప్పారు. సమావేశాలలో ఏదైనా నచ్చని అంశం ఉంటే, ఏదైనా అంశంపై ప్రభుత్వ తీరు నచ్చకుంటే సభలో స్పష్టంగా చెప్పి బాయ్ కాట్ చేయాలని సూచించారు. అంతేకానీ, అసెంబ్లీకి ఎన్నికైనా సరే శాశ్వతంగా సభకు రానని చెప్పడమేంటని మండిపడ్డారు. తమిళనాడు సభలో తనకు అవమానం జరిగిందని చెప్పి సభకు రానని జయలలిత గతంలో శపథం చేసిందని గుర్తుచేస్తూ.. ఆ సందర్భం వేరు అని చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితి వేరని, గతంలో అసెంబ్లీ నుంచి మెడపట్టి గెంటివేయించిన వ్యక్తి (రేవంత్ రెడ్డి) ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం చూడలేకపోతున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని సభకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అహంభావం పనికిరాదని నారాయణ హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తాను ఇదే విషయం చెప్పానని గుర్తుచేశారు. కేసీఆర్ ను అవినీతి, అహంభావమే ఓడిస్తాయని చెప్పానన్నారు. ఇప్పుడు అదే నిజమైందని, ఇప్పటికైనా అహంభావం వీడాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.
సినీ, టీవీ డబ్బింగ్ అసోసియేషన్ల పేరుతో వసూళ్ల దందా .. పట్టించుకోని అధికారులు : వి.సుధాకర్