ప్రధాని మోడీ , కేంద్ర మంత్రులు సహా బీజేపీ నేతలు తెలంగాణ సర్కారుపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. తమతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టేనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘‘నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా..” అని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చరిత్రలో ఏ ప్రధాని కూడా చేయని విధంగా మోదీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘శ్రీలంకలో ఒక ప్రాజెక్టును ఆయన స్నేహితుడికి ఇచ్చారు. అది కూడా భారత ప్రభుత్వం నామినేట్ చేసిందని.. ప్రధాని మోదీ ఒత్తిడి చేయడంతో ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక అధికారులు కూడా చెప్పారు. చరిత్రలో ఇలా ఏ ప్రధాని కూడా నామినేట్ చేయలేదు. మన దేశ ప్రధానిపై శ్రీలంకలో ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.” అని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశంలో కొత్త పార్టీ రావద్దా?
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, విప్లవ బాటలో పయనించాల్సి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాలి. తెలంగాణ మాదిరిగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టుకోవాలి. విప్లవ బాటలో పయనించాలి. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది..” అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అనుకూలతలు మన దేశానికి ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. కానీ కేంద్రం అసమర్థ విధానాల కారణంగా మనం పిచ్చి మొఖాలు వేసుకుని మెక్ డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నామని వ్యాఖ్యానించారు.
తేదీ ఖరారు చేయండి.. ముందస్తుకు వెళదాం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీ కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు వస్తే.. తాను రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తానని సవాల్ చేశారు. తాము ఎలాంటి కుంభకోణాలు చేయలేదని.. ప్రజల కోసం మంచి పనులు చేశామని, ప్రజలే తమను గెలిపిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.