రైతుబంధు ఇవ్వకుంటే పులుల్లాగా మీ గొంతు కరుస్తాం… నాలుగు నెలలు ఓపిక పట్టాం…. కానీ ఇక కేసీఆర్ ఆగడు… గద్దల్లా మీ వెంటపడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం పర్యటించిన కేసీఆర్, సాయంత్రం సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హామీలు నెరవేర్చే వరకు తాము కాంగ్రెస్ వెంట పడతామని హెచ్చరించారు. ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, వంద శాతం దానికి న్యాయం చేస్తామన్నారు. చేనేత కార్మికుల పట్ల కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని అవసరమైతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు.
కరీంనగర్‌లో తాము జలధారలు సృష్టిస్తే కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఈ జలధారలు ఎడారులుగా మారిపోయాయని ఆరోపించారు. దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. ఈ రోజు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంతో అద్భుతంగా ఉండేదని… ఎండకాలం తర్వాత కూడా సగం డ్యామ్ నీరు ఉండేదన్నారు. కరీంనగర్ నగరంలో కూడా నీళ్ళు వచ్చేవని… కానీ ఇప్పుడు రోజుమార్చి రోజు ఇస్తున్నారన్నారు. మున్ముందు మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారేమో అని విమర్శించారు. 2014కు ముందు కాలిన మోటార్లు, బిందెల కొట్లాటలు కనిపించేవని… ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా వేయలేదన్నారు.
100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని తాను చెబితే… జాబితా ఇవ్వాలని అధికార పార్టీ అడిగిందని, తాము నాలుగు గంటల్లోనే ఆ జాబితాను ఇచ్చామని గుర్తు చేశారు. వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచలేదు… పైగా ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను రెఫరెండం అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను టెంప్ట్ చేసిందన్నారు. ఇందిరమ్మ పాలనలో ఇగిలిచ్చిన పరిస్థితైందన్నారు. నీటి నిర్వహణ సామర్థ్యం లేక.. వాటిని ఎలా వాడాలనే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొంతమంది అసమర్థులైన మంత్రులు వర్షాపాతం తక్కువ ఉంటే మా మీద బద్నాం పెడుతున్నారని అంటున్నారని… కానీ పలు జిల్లాల్లో అధిక వర్షపాతం ఉందన్నారు. అధిక వర్షాపాతం ఉండగా పంట ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.
చేనేత కార్మికులు దొబ్బితిన్నారు… నిరోద్‌లు అమ్ముకొని బతకాలని అవమానిస్తారా… అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి మాట్లాడుతూ… తెలంగాణలో అసలు బీజేపీ లేనే లేదన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేక మా పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమన్నారు.