చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్మాదంగా ఉన్న వ్యక్తి ఇద్దరు యువకులపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
స్థానికంగా పండా కృష్ణమూర్తి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం ఆటో, బైక్‌లకు అడ్డంగా వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. అతని అప్రవర్తనను ప్రశ్నించేందుకు సోయం వినోద్ కుమార్ (28), తాటి భూపతిరాజు (34) అనే ఇద్దరు యువకులు అతని షాప్ దగ్గరకు వెళ్లారు. మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది.
దాంతో ఉన్మాదానికి దిగిన కృష్ణమూర్తి, తన షాప్‌లో ఉన్న కత్తిని తీసుకొని ఇద్దరినీ పొట్ట భాగంలో తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, దాడికి పాల్పడిన పండా కృష్ణమూర్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.