అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు దూకుడు ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకిచ్చారు.ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదని హితవు పలికారు.పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధాని మోదీ వ్యవసాయ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. వ్యవసాయదారులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. రైతులు మూస పద్దతిలో వేసిన పంట మళ్లీ మళ్లీ వేయడంతో గిట్టుబాటు ధర రావడం లేదని.. పంట మార్చి వేస్తే మరింత లాభాలు వస్తాయన్నారు. కరోనా సమయంలో రైతు ఇంట్లో కూర్చోకుండా పంట పండించారని.. అందరికంటే రైతు మిన్న అని ప్రశంసించారు. దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. అటు ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు అధికార పార్టీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందన్నారు.
