తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండానే మళ్లీ కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై రాహుల్ గాంధీ చర్చకు రావాలని సవాల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైంది? రుణమాఫీ చేయలేదు కానీ గిట్టుబాటు ధర ఇస్తారా? అన్నారు.
దేశంలో ప్రతి మహిళకు రూ.1 లక్ష ఇస్తామని చెబుతున్నారని, మొదట తెలంగాణలో ఇచ్చిన రూ.4వేల నిరుద్యోగ భృతి, పేదింటి మహిళకు నెలకు రూ.2,500 అమలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తుంటే ఉట్టికి ఎగరలేనివాడు ఆకాశానికి ఎగిరినట్లుగా ఉందన్నారు. రాహుల్ గాంధీకి ఏమాత్రం అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.