కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందించిన ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వరమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్. టి. సి. బస్ డిపోలో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణం విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను అధికారుల సమన్వయంతో జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మహాలక్ష్మి పథకం విజయవంతంలో ఆర్. టి. సి. అధికారులు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్ లు, సిబ్బంది పాత్ర కీలకమైనదని అన్నారు. ప్రభుత్వం డిపోలకు నూతన బస్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రాగునీరు, మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో వెలుగు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఉద్యోగ, వ్యాపార, పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలను ప్రోత్సహిస్తూ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ విశ్వనాథ్, ఆర్.టి.సి. అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.