కాకినాడ : ప్రతిష్ఠాత్మక వివేకానంద పార్కు ప్రధాన గేట్లు మూసి వుంచడం ప్రజాహిత విధానం కాదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. గాంధీనగర్ పార్కు నాలుగు వైపులా గేట్లు తెరిచి ప్రవేశం కల్పిస్తున్న రీతిగా వివేకానంద పార్కు ప్రధాన గేట్లు ఎందుకు తెరవడం లేదని..? ప్రశ్నించారు. జవహర్ వీధిలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటైన పార్కు తొలి గేటు బాదం వారి వీధిలో కరెంటు ఆఫీస్ ప్రక్కన వున్న ప్రధాన గేటు తెరవకుండా సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది లేరని ట్రాఫిక్ పోలీస్ ఆంక్షలని పేర్కొంటూ గత కరోనా లాక్ డౌన్ నుండి మూసి వుంచడం మంచి పద్దతి కాదన్నారు. వైఎస్ఆర్ స్కేటింగ్ గేటు ప్రయివేటు కాంట్రాక్ట్ నిర్వహణలో వున్నందున ఆ ఇరుకు మార్గంలో పార్కు లోపలికి వెళ్లడం రావడం కష్టతరమని చెబుతున్నా, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పార్కు లోపలికి వెళ్ళిన వారు బయటకు రావాలంటే ప్రధాన గేట్లు పార్కు వేళల్లో తీసి వుంచకపోవడం వలన నడక యాతన ఎక్కువ అవుతోందన్నారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ కార్పోరేషన్ అధికారుల తీరు నియంతృత్వంగా వుండడం వలన ప్రజలకు మేలు జరగడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో దాఖలవుతున్న అర్జీల పట్ల సమాచారం గ్రహించి నగర ప్రగతికి కృషి చేయాల్సిన బాధ్యత వుందన్నారు. బాదం వారి వీధిలో ఇరుకైన చిన్న గేటు ప్రవేశం మహిళలకు ఆకతాయిలతో ఇబ్బందికరంగా వుందన్నారు. గేటు ఎంట్రీ ప్రదేశంలో పిల్లలు ఆడుకునే పరికారాలుండడం వలన పార్కు ప్రవేశ మార్గం సౌకర్యంగా లేదన్నారు. నిధుల లేమి, సిబ్బంది కొరత పేరిట నగర పాలక సంస్థ పార్కు ప్రయోజనాలను దెబ్బతీయడం తగదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు.