పిఠాపురం : అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో రాజన్నపేట గ్రామంలో అక్రమ క్వారీ మైనింగ్ గురించి స్పందన కార్యక్రమంలో సోమవారం చోడవరం జనసేన పార్టీ ఇన్చార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు రాజు వ్యక్తిగతంగా ఫిర్యాదు సమర్పించారు. క్వారీ యజమానులు వ్యవసాయ చెరువు మధ్య నుండి అనధికారిక రహదారి నిర్మించారని, ఇది రైతుల పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రెవెన్యూ మరియు నీటి పారుదల శాఖల ఆదేశాలు జారీ అయ్యే వరకు కార్యకలాపాలను నిలిపివేయాలని తెలిపినప్పటికీ క్వారీ లీజుదారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక సామర్థ్యపు పేలుడు పదార్థాలను వాడడం వలన శబ్ద కాలుష్యం మరియు క్వారీ చుట్టూ ఉన్న ఇల్లు మరియు వ్యవసాయ భూములకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అనుమతించిన సామర్థ్యాన్ని మించి లోడెడ్ వాహనాలు నడుపుతూ బుచ్ఛెంపేట గ్రామాలలో రోడ్లను తీవ్రంగా నాశనం చేస్తున్నాయి అని తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ అక్రమ కార్యకలాపాల దుష్ఫలితాలను ప్రజలు ఎందుకు భరించాలి అని మరియు వారు ఈ మైనింగ్ వల్ల వారికి వచ్చే లాభం ఏమిటని అని అడిగారు. అలాగే మైనింగ్, రెవెన్యూ, నీటి పారుదల మరియు పంచాయతీ రాజ్ విభాగాలు క్వారీ లీజుదారుల చేస్తున్న అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాల పరి రక్షణ కోసం కోసం క్వారీ ఆపరేటర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
