- ఘనంగా సన్మానించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రచయితల సంఘం
పిఠాపురం : యువ సాహితీవేత్త, రచయిత, విశ్లేషకుడు, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లీడర్, పిఠాపురం పట్టణానికి చెందిన డాక్టర్ కిలారి గౌరీ నాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో యువ సాహితీ పురస్కారం అందుకున్నారు. కోనసీమ రచయితల సంఘం మరియు అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురంలో నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో గౌరీ నాయుడు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సాంస్కృతిక చైతన్య సాహిత్యం అనే అంశంపై కవిత గానం చేశారు. అభ్యుదయ గీతాలను కూడా ఆలపించి ప్రేక్షకులను అలరించారు. మాతృభాష, సంస్కృతి, సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి సాహిత్య సంస్థల ద్వారా సాహిత్య వ్యాప్తికి గౌరీ నాయుడు చేస్తున్న విశేష కృషి కి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించే అనేక కార్యక్రమాలు విద్యాసంస్థల్లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సాహిత్య ,సంగీత, సాంస్కృతిక, పరిశోధన ,కళా రంగాలలో గౌరీ నాయుడు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్ డాక్టర్ ప్రతాప్, శ్రీశ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు సిహెచ్.లలిత, ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం ప్రతినిధులు బి.వి.వి.సత్యనారాయణ, పార్థసారథి, రమావతి, తదితరులు గౌరీ నాయుడుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు గౌరీ నాయుడుకి అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులు, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 32 ప్రపంచ రికార్డులు సాధించిన శ్రీశ్రీ కళావేదిక తనని సత్కరించడం జీవితంలో మరిచిపోలేని ఒక అపూర్వ సన్నివేశంగా మిగిలిపోతుందని గౌరీ నాయుడు పేర్కొన్నారు. సాహిత్య రంగంలో కృషి చేయడానికి సహకరించిన సాహిత్య గురువులకు, విద్య నేర్పిన ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు గౌరీ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.