కాకినాడ : జెఎన్టియుకె ప్రాంగణంలో సెనేట్ హాలు నందు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె)లోని కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (సిఎస్ఈ) విభాగంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ ఏఐ&ఎంఎల్ ఆధ్వర్యంలో “ఇండస్ట్రీ 4.0” అను అంశంపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎఫ్ఎపీ) శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొ. కెవిఎస్టి జి. మురళీకృష్ణ, ముఖ్యఅతిథిగా విచ్చేయగా గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొ. కెవి. రమణ, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొ.వి. రవీంద్రనాధ్, ఓఎస్టి ప్రొ.డి. కోటేశ్వరరావు, రీసోర్స్ పర్సన్స్ గా విశాఖపట్నం ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లోని మెకట్రానిక్స్ విభాగాధిపతి డా.కె. మురళీకృష్ణ, ఫైటెక్ ఎంబెడెడ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డా.బి. వల్లభరావు, అతిధులుగా యుసిఇకె ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ప్రొ. ఎన్.మోహన్రావు, సిఎస్ ఇన్ఛార్జి విభాగాధిపతి డా. పి. కరుణలు వేదికనలంకరించారు. ఎఫ్ఎప్ ప్రోగ్రాము ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జి డైరెక్టర్ ప్రొ.ఎ.ఎస్.ఎన్.చక్రవర్తి, సిఎస్ఈ విభాగం ప్రొఫెసర్ డా.ఎల్. సుమలతలు కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తుండగా డా.టి. శివరామకృష్ణ, డా.ఇ. సునీతలు కో-కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొ. కెవిఎస్జీ. మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రస్తుతం ఆదరణలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐఓటి, డేటా సైన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్ టెక్నాలజీ, అగ్యుమెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (విఆర్) తదితర కోర్సులు పరిశ్రమలకు అనుగుణంగా అధ్యాపకులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ల ద్వారా ఆధునిక సాంకేతిక అంశాలపై వృత్తిపరమైన అవగాహన పొందాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల ప్రస్తావించిన ఇండస్ట్రీ రెడీ కోర్సులకు సంబంధించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాము నిర్వహిస్తున్నందుకు ఎఫ్ఎపి కో- ఆర్డినేటర్లను అభినందించడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అనేక మంది విద్యార్థులు సాంకేతికపరంగా ఆదరణలో ఉన్న కోర్సులలో చేరుతున్నారని, వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చునన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు విద్యావ్యవస్థ మరియు పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రెక్టార్ ప్రొ. కెవి. రమణ మాట్లాడుతూ ఎఫ్ఎపి ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఆధునిక సాంకేతికతలు, ఐఓటి సెన్సార్లు, పరికరాలు, క్లౌడ్ ప్లాట్ఫారమ్ల గురించి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రయోగాత్మక అనుభవంతో పాటు విభిన్న కేస్ స్టడీలపై చర్చించేందుకు అధ్యాపకులకు, పరిశోధక విద్యార్థులకు అవకాశం లభిస్తుందన్నారు. ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొ.వి.రవీంద్రనాధ్ మాట్లాడుతూ విద్యాసంస్థ మరియు పరిశ్రమల అనుసంధానం ద్వారా విద్యార్థులకు బోధన, అభ్యాసన పద్ధతులను ప్రయోగాత్మకంగా వివరించేందుకు వీలు కలుగుతుందన్నారు. రీసోర్స్ పర్సన్స్ గా పాల్గొన్న డా.కె. మురళీకృష్ణ, డా. బి.వల్లభవులు పరిశ్రమలలో అనుసరించే పలు సాంకేతికత పద్ధతులను, డ్రోన్ టెక్నాలజీ, పరిశ్రమల సుస్థిరాభివృద్ధి కోసం విద్యాసంస్థ మరియు పరిశ్రమల అనుసంధానంపై అధ్యాపకులకు, పరిశోధక విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, విభాగాధిపతులు, యుసిఇకె అధ్యాపకులు, అనుబంధ కళాశాలల అధ్యాపకులు. పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
