పిఠాపురం : ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఏం.ఎల్.సి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలో కూటమి నేతలు పిఠాపురంలో కుమ్ములాడుకున్నారు. ఫ్లెక్సీలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఫోటో చిన్న సైజులో ఉండడం పై రగడా మొదలైంది. వేదికపై మాట్లాడతానంటూ పట్టుబట్టిన జనసేన నాయకుడు, మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు ఏం.ఎల్.సి అభ్యర్థిని కండువాల గురించి అడగ్గా వివాదం మొదలైంది. కూటమి పార్టీ విస్తృత సమావేశ వేదికపై మరోసారి టిడిపి జనసేన పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మీరు కూటమి అభ్యర్థ లేక తెలుగుదేశం అభ్యర్ధా..? అని ఏం.ఎల్.సి. అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు ప్రశ్నించారు. దానితో ఒక్కసారిగా అరుపులు, కేకలు, తోపులాడుతో వాతావరణం ఉదృతంగా మారింది. సమావేశ హాలులో వున్న టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా జై వర్మ, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో ఆదిపత్యాన్ని ప్రదర్శించారు. నెలకి ఒకటి రెండుసార్లు తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగుతుంది. గత నెలలో పల్లెపండుగ కార్యక్రమంలో పిఠాపురం మండలం వెల్దుర్తిలో కొబ్బరికాయ కొట్టే విషయంలో కూడా వివాదం చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్లను, జనసేన నాయకులును వారించడానికి ప్రయత్నం చేసిన ఇన్చార్జులు ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ , మర్రెడ్డి శ్రీనివాసులు వారిని వారించడంలో విఫలమయ్యారు. కార్యకర్తలు సమన్వయం పాటించకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగించారు. అనేక సందర్భాల్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరగడానికి కారణం వైసీపీ నుంచి వచ్చిన వారివల్లే అంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆరోపించారు. దుష్టశక్తులు కూటమి ఐక్యతను విచ్చినం చేసెందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపణ చేశారు. తెలుగుదేశం, జనసేన, బిజెపికి సంబంధించిన అసలైన కార్యకర్తలు అందరం కలిసే ఉంటున్నాం అంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్కొన్నారు. వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వారే ఈ విధమైన గొడవలను సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ విమర్శించారు. నియోజకవర్గంలో ఇంత గందరగోళం జరుగుతున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ ఒక్కసారి దృష్టి పై పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.