పిఠాపురం : ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో జరిపే పర్యటనలకు సమగ్రమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులును ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులతో కలిసి గొల్లప్రోలు, పిఠాపురం, పి.వెంకటాపురం, యు.కొత్తపల్లిలలో పర్యటించి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం జరుపనున్న పర్యటనల కొరకు చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. తొలుత గొల్లప్రోలు జడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన పర్యటించి ఉపముఖ్యమంత్రి ప్రారంభించనున్న పాఠశాల సైన్స్ లాబ్, గొల్లప్రోలు మండలంలో నిర్వహించిన అభివద్ది పనులకు ఫలాకాల ఆవిష్కరణ, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ, అనంతరం మీడియా బ్రీఫింగ్ కొరకు ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో బారికేడింగ్, షామియానాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తదితర అంశాల ఏర్పాటుపై ఆయన ఆధికారులకు సూచనలు జారీచేసారు. అనంతరం పిఠాపురం టిటిడి కళ్యాణ మండపంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే డిగ్రీ కాలేజి ప్రారంభం, టిటిడి కళ్యాణ మండపం మరమ్మతులు, మాడవీధుల అభివద్ది, సాంఘికసంక్షేమ బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ రిపోర్లు, బాదం మాధవరావు హైస్కూల్ భవన మరమ్మతులు, దూడల సంత ఆధునీకరణ తదితర పనులకు ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే పి.వెంకటాపురం బాలికల హాస్టల్ ను సందర్శించి అక్కడ ఉపముఖ్యమంత్రి విద్యార్థినులతో కలిసి మద్యాహ్న భోజనం చేసి, వారితో ముచ్చటిస్తారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చివరిగా యు.కొత్తపల్లి పిహెచ్సిసి చేరుకుని, అక్కడ ఉపముఖ్యమంత్రి పిహెచ్సి ఓపి బ్లాక్, నాలుగు ఎంపిపి పాఠశాల భవనాల నిర్మాణానికి జరిపే శంకుస్థాపన కార్యక్రమాల కొరకు ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి ఉపముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జడ్ పి సిఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ ఆర్డిఓ ఎస్.మల్లిబాబు, డిఈఓ పి.రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.