అమెరికాలో న్యూయార్క్ నందు జరుగుతున్న 79వ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన యువ ఎంపీలను సమితి ప్రతినిధులు ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జరగనున్న 79వ సమావేశాలకు భారతదేశం నుండి 9 మంది ఎంపీలను ఆహ్వానించగా, అందులో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు అవకాశం దక్కింది. అలాగే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన మొట్టమొదటి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కావడం గమనార్హం. గడిచిన ఎన్నికల్లో కాకినాడ నుండి భారీ మెజారిటీతో ఎన్నికైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలలో పిన్న వయస్కుడు. ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని, సమావేశాల్లో పాల్గొంటున్న మేధావుల సూచనలు, సలహాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే రాజకీయంగా అన్ని విధాల ప్రోత్సహించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.