కాకినాడ : విజయదశమి ముగిసి 28 రోజులైనా సూర్యారావుపేట బాల త్రిపురసుందరి శివాలయంలో నెల (38రోజుల) క్రిందట ప్రవేశపెట్టిన రూ.20, 50 ధరల దర్శనం టిక్కెట్లు వసూలు చేయడం వలన కార్తీకమాసంలో రామలింగేశ్వరస్వామి దర్శనానికి వచ్చే సాధారణ, మధ్యతరగతి భక్తులను, శివారాధకులను దూరం చేస్తున్న వైనంగా ఉందని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. కార్తీకమాసం నుండిసంక్రాంతి వరకు అయ్యప్పమాలధారణ స్వాములు, శివభక్తులు రెండు పూటలా వస్తారని, వారికి శివశక్తి దర్శనభాగ్యం లేకుండా ధరల అడ్డుగోడ నిలపడం ధర్మం కాదన్నారు. దేవాదాయశాఖ నిర్వహణ ధనాదాయశాఖగా తయారవ్వడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే బాలత్రిపుర సుందరి శివాలయంలో టిక్కెట్ కౌంటర్ ఎత్తివేసి వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అమ్మవారి గడప వద్ద, మహాశివుని గర్భాలయం వద్దదర్శనం చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. సాధారణ పేద, ధనిక కుల వ్యత్యాసాలు లేకుండా అందరికీ శఠగోపం అందించే చర్యలు అమలు చేయాలన్నారు. పరపతి కలిగిన వారికి, డొనేషన్ ఇచ్చే వారికి, కరెన్సీ నోట్లు కానుకలందించే వారికి మాత్రమే మర్యాదలు చేస్తున్నారన్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదన్నారు. నాణాలు సమర్పించే వారిని హీనంగా, అంటరానితనంగా చూస్తున్నారన్నారు. ఆలయంలో అన్నదానం నిర్వహణ గతంలో టేబుల్ వేసి కుర్చీల్లో కూర్చున్న భక్తులకు ఆకులో భోజనపదార్థాలు వడ్డించే వారని ప్రస్తుతం యాచకులకు పెడుతున్న తరహాలో స్టీల్ ప్లేట్ తో నిలబడితే పేరు వ్రాసుకుని అన్నం పెట్టడం దురదృష్టకరంగా వుందన్నారు. 50, 60 మందికి పెడుతున్న అన్నదానాన్ని వందల్లో పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా రికార్డులు తయారుచేయడం శోచనీయంగా వుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరగడం వలన తక్కువ ధరకు వచ్చే ఆహార కల్తీ పదార్ధాలతో నాణ్యత లేని భోజనం పెడుతున్నారన్నారు. దాతలు ఇస్తే తప్ప భక్తుల చేతిలోకి దేవాదాయశాఖ నిర్వహణ తరపున కాసింత పులిహోర ప్రసాదం కూడా పెట్టడం లేదన్నారు. దేవాలయాల్లో గౌరవ పూర్వక పద్ధతుల్లో ఆధ్యాత్మికంగా అన్నసంతర్పణ జరిగే విధానాలు పాటించాలన్నారు. కాకినాడ తీరంలోని పారిశ్రామిక సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థల నుండి, విదేశీ భక్తుల నుండి బాల త్రిపుర సుందరి పేరు చెప్పి అత్యధిక విరాళాలు తెచ్చుకుంటున్న ఎండోమెంట్స్ నిర్వహణ బక్కచిక్కిన ఆవుల ముందు పదిగడ్డి పరకలు పాడేసి ప్రదిక్షణల రూపంలో పంచుకుంటున్న చందంగా వుందన్నారు. కార్పోరేట్ తరహాగా దేవాలయ నిర్వహణ తగదన్నారు. జరుగుతున్న పూజలు ధరలు, ప్రయివేటు ఆదాయాలు, అవినీతి అక్రమాలు, బాధ్యతా రాహిత్య విధానాలు దేవాలయాల్లో తిష్ట వేయడం శోచనీయంగా వుందన్నారు. దేవాలయాల్లో భక్తుల సూచనలు, సలహాలు, పిర్యాదులు స్వీకరించే సీల్డ్ బాక్స్ ఏర్పాటు చేయించి, వాటిని పరిష్కరించే బాధ్యత పైస్థాయి ఉన్నతాధికారులు వహిస్తే ఆలయాలు సనాతన ధర్మంగా బాగుపడే అవకాశం వుంటుందని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.