పిఠాపురం : రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి వార్షిక కళ్యాణ వేడుకలకు సందర్భంగా స్వామి వారి కళ్యాణ ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపించారు. ఆలయం వద్ద నుండి పెద్ద బజారు, కోటగుమ్మం సెంటర్, సినిమా సెంటర్ మీదుగా తిరిగి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం సాగింది. దారి పొడవునా మహిళలు స్వామికి హారతులు అందించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయ జనార్ధనాచార్యులు పూజాదికాలు జరిపించగా, కార్యనిర్వాహణాధికారి నున్న శ్రీరాములు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది సత్యనారాయణ, వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి సేవా సమితి ప్రెసిడెంట్ చెరుకుపల్లి శ్రీనివాస్, శ్రీరాంమోహన్, కొల్లూరి లక్ష్మీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.