- శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా
పిఠాపురం : బాల్య దశ నుండే తాత్విక సంపద పిల్లలకు ఇవ్వ గలిగితే ఉజ్వలమైన భవిష్యత్తు మరియు ఉన్నత వ్యక్తిత్వం ఏర్పడుతుంది అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. గురువారం సాయంత్రం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించారు. పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ పిల్లలకు గ్రంథాలయాలకు వెళ్లే అలవాటు చెయ్యాలని, బాల బాలికలు, యువత తాత్విక చైతన్యం పొందుట ద్వారా మన భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా పరిణామం చెందునన్నారు. సుమారు 18 మంది పిల్లలు హిందీ, ఆంగ్ల, తెలుగు భాషలలో నిర్వహించిన కార్యక్రమాలు అమోఘం, అద్భుతం అని డా ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు అని శ్లాఘీంచారు. పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరిగే విధంగా తాత్విక బాల వికాస కార్యక్రమాలు ప్రదర్శించారు అని బాలబాలికలను అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఏవివి సత్యనారాయణ నేటి కార్యక్రమ విశిష్టత తెలుపుగా ఎన్టీవీ ప్రసాద వర్మ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలకు శిక్షణ ఇచ్చిన టీచర్ లు, వై. అరుణకుమారి, వెంకట లక్ష్మి, సిహెచ్.వరలక్ష్మిలను స్వామి అభినందించారు. కార్యక్రమ నిర్వాహకుడు ఏవివి సత్యనారాయణని స్వామి శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పాల్గొన్నారు. అనంతరం మొహద్దీన్ బాద్షా స్వామి కుటీరం వద్ద కార్తీక మాస దీపోత్సవం పీఠాధిపతి డా ఉమర్ అలీషా ప్రారంభించారు. వందలాది మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.