- పాదగయకు పోటెత్తిన భక్తులు
- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దంపతులు
పిఠాపురం : కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా పాదగయ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున నుంచే ఆలయ పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి పుష్కరిణిలో విడిచి పెట్టారు. ఆలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మారుమొగింది. భక్తులందరూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంతో తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. చంటి పిల్లలకు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటేషన్ సిబ్బంది ప్రత్యేకంగా ఆలయంలో పరిశుభ్రతను చేశారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దంపతులు పాదగయ క్షేత్రానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు ముమ్మిడి వెంకన్నబాబు, వైయస్ఆర్సీపీ నాయకులు దుర్గాప్రసాద్, గణేష్, ముమ్మడి శివశంకర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.