- నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గురూజీ వారిని పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి గురువుగారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం యూనియన్ సంక్షేమ నిధికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పదివేల నూట పదహారు రూపాయల నగదును అందించి వారి దాతృత్వాన్ని, దాన గుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతర శ్రామికులని, కులమతాలు, రాగద్వేషాలు లేని నిస్వార్థ ప్రజల పక్షాన నిలబడే కలం యోధులని, అలాంటి జర్నలిస్టులు అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడటం చాలా సంతోషదాయకమైన విషయమని తెలిపారు. తమ పీఠం తరపున పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఊరు బాగు కోసం జర్నలిస్టులు తమ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ పిఠాపురంలో పలు బృహత్తర కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నా మొక్క నా శ్వాస అనే నినాదంతో దశాబ్దాలుగా ఎన్నో పట్టణాలు, పల్లెల్లో లక్షలాది మొక్కలను నాటుతూ స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేలా, వాయు కాలుష్యాన్ని నిర్మూలించేలా నిరంతరం ఒక మహా యజ్ఞంగా సమస్త మానవాళికి మంచి చేసే విధంగా డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కులమతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రతి మానవుడు తోటి వారిలో పరమాత్మను దర్శిస్తూ సర్వాంతర్యామి అంతట తానై ఉన్నాడని గ్రహించి, సమస్త విశ్వశాంతిని ఆకాంక్షించే విధంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని ముందుకు సాగుతోంది అన్నారు. అలాంటి ఈ పీఠంలో పీఠం చేస్తున్న సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విశ్వవ్యాప్తంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి జర్నలిస్టులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనుబాబు, సెక్రటరీ వేగా న్యూస్ శ్యాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బళ్ళ సురేష్, జాయింట్ సెక్రెటరీ రాయుడు శ్రీను, కోశాధికారి కొమ్మనాపల్లి రామకృష్ణ కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్ యాండ్ర, బర్రె చిన్నబ్బాయి, దాకే సింహాచలం, దుళ్ళ కృష్ణ, ఏ.లక్ష్మణ్, జొన్నాడ లోవరాజు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.