పిఠాపురం : ఆత్మ శోధనకు మార్గదర్శనమైనది ధ్యాన శోధన అని, ధ్యానం ద్వారా మానసిక సమతుల్యత, పరిపూర్ణత్వం లభించునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి చరవాణి ద్వారా వారి అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ధ్యాన మందిరంలో నిర్వహించిన ధ్యాన సాధనను ఉద్దేశించి పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో పురాతనమైన, ఉత్కృష్టమైనది ధ్యాన సాధన, ధ్యానం మూలం మిథం జగత్ అనగా ఇహానికి, పరానికి వారది ధ్యానం అన్నారు. ఈ పీఠం ప్రభోధం చేయు త్రయీ సాధనలో మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఇహానికి, పరానికి వారిది అనగా శారీరక, మానసిక వ్యవస్థను నియంత్రిస్తూ, సమాజంలో సుఖంగా, శాంతిగా జీవిస్తు, ముముక్షత్వం పొంది తరించు మార్గము ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చని పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎ.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ధ్యాన సాధన విధానం వివరించి, ధ్యానం అంతర్ దృష్టిని అభివృద్ధి చేయునని అన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ధ్యానం యోగాలో ఒక భాగం అని చెబుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరీ, ప్రశాంతంగా జీవితాన్ని గడప వచ్చునని, ఎంత పెద్ద సమస్యనైనా చిన్నదిగా ఊహించుకుని, పరిష్కరించుకోగల మానసిక శక్తిని ధ్యానం ద్వారా పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కృష్ణ కుమార్ సాంకేతిక సహాయం అందచేశారు. వందలాది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.