పిఠాపురం : గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడిగా మురాలశెట్టి సునీల్ కుమార్ (జనసేన) ఎంపికయ్యారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా తమలంపూడి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తూర్పు డెల్టా పరిధిలోని 16 సాగునీటి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్, ఇరిగేషన్ డీఈ ఆకెళ్ళ రవికుమార్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పిఠాపురం నియోజవర్గ జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు ప్రత్యేకంగా తరలివచ్చి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు. సునీల్ కుమార్ పిఠాపురం నియోజవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన జనసేన నేత కావడంతో అక్కడ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తూర్పు డెల్టా పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాలు పైబడి సాగులో ఉన్నాయని, సాగునీటి అంశంలో ప్రతీ రైతుకూ న్యాయం చేస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. నూతన కమిటీని పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పిఠాపురం నుంచి తొలిసారి తూర్పు డెల్టా చైర్మన్ పదవి కైవసం కావడంతో పిఠాపురం నియోజవర్గ రైతులు సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి గొల్లప్రోలు మీదుగా చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.