- శరవేగంగా చంద్ర మహేష్ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం
పిఠాపురం : హిట్లకు మారుపేరుగా మారిన దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో, మహేష్ చంద్ర సినిమా టీం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిత్రం “పిఠాపురంలో అలా మొదలైంది” ముహూర్తపు సన్నివేశాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు)లు నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ పై క్లాప్ కొట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు శరవేగంగా పిఠాపురంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన తాను ఎన్నో వరుస విజయవంతమైన సినిమాలు నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం సరికొత్త ప్రేమ కథతో నిర్మించబోతున్న చిత్రం నిర్విరామంగా పిఠాపురం నియోజవర్గంలో పలు ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుందన్నారు. ముఖ్య తారాగణంపై చిత్రీకరించే సన్నివేశాలని స్థానిక బాదం మాధవరావు (బి.ఎం.ఆర్) హై స్కూల్ లో చిత్రీకరించడం జరిగిందన్నారు. స్థానిక నటీనటులకు ప్రాముఖ్యత కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. నేడు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు షాపింగ్ కాంప్లెక్స్ లో చిత్ర నిర్మాణం జరుగుతుందనితెలిపారు. ఈ చిత్రంలో నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, కేదార్ శెట్టి, జే.వాహిని, శిల్పి రాజ్ కుమార్ వడయార్, సాయి ప్రణీత్, సన్నీ అఖిల్, ప్రత్యూష, శ్రీలు, రెహానా, మణి చందన, అన్నపూర్ణ, బి.ఎన్.రాజు నటిస్తుండగా, కథ నిర్మాణ సహకారం శ్రీరామ్ యేదోటి, చిత్ర చాయాగ్రాహకుడిగా మస్తాన్ షరీఫ్, మ్యూజిక్ జి.సి.కృష్ణ, ఎడిటర్ నాని, కో- డైరెక్టర్ పవన్ వ్యవహరిస్తున్నారు. యువతను ఆకట్టుకునే రీతిలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా థియేటర్లో వీక్షించి చిత్ర విజయాన్ని చేకూర్చాలని దర్శకుడు చంద్ర మహేష్ ఆకాంక్షించారు.