కాకినాడ : జెఎన్టియుకె ప్రాంగణంలో ఆదివారం ఇంజనీరింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కాకినాడ (ఎకోశాక్) పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. అలూమ్ని ఆడిటోరియం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొ. కెవిఎస్.మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొ. కెవి. రమణ, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొ.వి.రవీంద్రనాధ్ లు విచ్చేశారు. యుసిఇకె ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ & అలూమ్ని రిలేషన్స్ సెల్ స్పెషల్ ఆఫీసర్ ప్రొ.ఎన్.మోహన్రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొ. కెవిఎన్ది. మురళీకృష్ణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి ఇతోధికంగా సహకరించి మరింత అభివృద్ధి బాటలో పయనింపజేసేలా కృషి చేయాలన్నారు. జెఎన్టిటియుకెలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చేలా అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులకు నిర్వహించిన ఆటలు, క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. అనంతరం ఎకోశాక్- 2025 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముందుగా ఎకోశాక్ హైదరాబాద్ ఛాప్టర్ వారి సహకారంతో యూనివర్శిటీ పరిపాలనా భవనం వద్ద ఏర్పాటుచేసిన సరస్వతీ దేవి విగ్రహాన్ని అధికారులు మరియు పూర్వ విద్యార్థుల సమక్షంలో ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొ. కెవిఎస్. మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎకోశాక్ విశాఖపట్నం ఛాప్టర్, హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు, టీచింగ్ & నాన్ టీచింగ్ సిబ్బంది, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.