పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9,10,11వ తేదీల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వం అని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ సభల్లో దేశ విదేశాల నుండి సుమారు 36 వేల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సభల్లో పాల్గొనే సభ్యులకు పీఠం వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేసామని అన్నారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ 1472వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ పీఠం గత 553 సంవత్సరములుగా ఆర్ష సూఫీ వేదాంత సారాన్ని ఏకత్వ రూపంగా ప్రబోధిస్తోందని అన్నారు. క్రీ.శ.1928 నుండి పంచమ పీఠాధిపతి నిర్వాణానంతరం, ప్రతీ ఏటా పవిత్ర మాఘ మాసం శుక్ల పక్షం నందు మూడు రోజులు పాటు తాత్విక విజ్ఞానాన్ని సాధారణ మానవునికి, సామ్రాజ్య నేతలకు బోధిస్తూ మహా సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల, మత, జాతి, వర్ణ, లింగ, వర్గ తారతమ్యాలు లేని, సర్వ మానవ సమానత్వం కోసం అందరికీ ఆచరణ యోగ్యమైన తత్వాన్ని బోధిస్తున్న విద్యా కేంద్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధుసూధనరావు, అశోక్, పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్, పట్టణ అడిషనల్ ఎస్.ఐ. జాన్ భాషా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్.టి.వి ప్రసాద్ వర్మ, పింగళి ఆనంద్, ఏవీవి సత్యనారాయణ, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు.