- కట్టడి చేయించాలని కోరుతున్న పౌర సంక్షేమ సంఘం
పిఠాపురం : సారా నిషేధం అమలులో వున్నప్పటికీ కాకినాడ జిల్లాలో నగరం పట్టణం గ్రామం అనే తేడా లేకుండా లీటరు రూ.500 వంతున యధేచ్చగా సారా విక్రయాలు సరఫరా రెట్టింపు స్థాయిలో నడుస్తున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. దాడులు, కేసులు, బెల్లం ఊట ధ్వంసం వంటి ప్రక్రియలను ప్రభుత్వ రికార్డుల కోసం ప్రజలకు పత్రికలకు నిఘా నిర్వహణ చేస్తున్నామన్న నమ్మకాన్ని ప్రేరణ చేయడం కోసం ప్రీప్లాన్డ్ గా అమలు చేస్తున్నారన్నారు. అసలు మాఫీయా కుటీర పరిశ్రమల తరహాలో సారా తయారు చేయించడానికి బ్యాక్ గ్రౌండ్ గా ఏర్పడి కోట్ల రూపాయల్లో వ్యాపారం కొనసాగిస్తూనే వుందన్నారు. కాకినాడ నగరంలో ఏటిమోగ, నాగరాజుపేట, దుమ్ములపేట, శంతనపురికాలనీ, డ్రైవర్స్ కోలనీ, బీచ్ రోడ్ రూరల్ లో వాకలపూడి, ఉప్పాడ, తూరంగి, ఇంద్రపాలెం, కాజులూరు, నడకుదురు, పిఠాపురం, యు.కొత్తపల్లి, తొండంగి, కోటనందూరు, శంఖవరం, ఏలేశ్వరం, హంసవరం, కొత్తూరు, తాళ్ళూరు, అద్దరిపేట, పంపాదిపేట, వేమవరం, ఒంటిమామిడి, కందరాడ, మల్లాం, విరవాడ, విరవ, బి.కొత్తూరు, పి.దొంతమూరు, జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తుని, గొల్లప్రోలు ప్రాంతాల్లో సారా అమ్మకాలు సరఫరా యధేచ్చగా వుందన్నారు. మద్యం రేటుకు రెట్టింపు సారా వస్తున్నందున ఎక్కువగా బానిసలవుతున్నారన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అక్రమసారా నిర్వహణను అరికట్టలేక lపోవడం దురదృష్టకరంగా వుందన్నారు. సారా మహమ్మారి వలన అనారోగ్యాలకు మరణాలకు గురవుతున్న లెక్కలపై ప్రభుత్వం లెక్కలు తీయించి కట్టడి చేసే బాధ్యత వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. వైన్స్ దుకాణాల వద్ద చలివేంద్రంలో దాహార్తిని తీర్చే త్రాగు జలాల తరహాలో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్న తీరు వలన మద్యం మత్తు పదార్థాల బెడద ఎక్కువయ్యిందన్నారు.