- చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
పిఠాపురం : ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పిఠా‘‘పుర’’ంలో మాత్రం అమల్లో లేదు. డిప్యూటీ సిఎం, స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అద్దం పట్టినట్టు కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి రాజకీయ ప్రచారాలుగానీ, దానికి సంబంధించిన బ్యానర్లు పెట్టడం నిషేధం. కానీ పిఠాపురం పట్టణంలో స్థానిక సీతయ్య గారి తోటలో ఉన్న జనసేన పార్టీ పిఠాపురం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించకపోవడం, చూసీ చూడనట్లు వ్యవహరించడంపై అధికార పార్టీకి పిఠా‘‘పుర’’ం అధికారులు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో వున్న బ్యానర్లను తీసివేసిన మున్సిపల్ అధికారులు జనసేన పార్టీ కార్యాలయ బ్యానర్లు తీయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజలకు ఏ సమస్య వున్నా అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపడతామన్న పవన్ కళ్యాణ్ మాటలు ఆ అధికారులే సమస్యగా మారితే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో పిఠాపురం ప్రజలు వున్నారు. ఏదీ ఏమైనా దీనిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.!