కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కమీషనరేట్ లో పనిచేస్తూ పదవీకాలం ముగిసిన ముగ్గురు ఏఎస్సైలు మహమ్మద్ యూసఫ్ షరీఫ్ 41 సంవత్సరాలు, బి. మల్లయ్య 39 సంవత్సరాలు, యం.లక్ష్మయ్య 35 సంవత్సరాలు సుదీర్ఘ కాలంపాటు పోలీసు శాఖకు సేవలందించి సోమవారంనాడు పదవి విరమణ పొందారు. కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలునందు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కరీంనగర్ అడిషనల్ డీసీపీ ఎ.లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా చేసి పదవి విరమణ పొందడమే గొప్ప విజయం అన్నారు. ఇంతకాలం సేవలందించగలిగారంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందన్నారు. పదవి విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న అధికారులకు అడిషనల్ డీసీపీ గారి చేతుల మీదుగా పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. వారికి జ్ఞాపికలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మీనారాయణతో పాటుగా రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి (సంక్షేమం) కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడాల సురేందర్, రిజర్వు ఎస్సై తిరుపతి ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.