కరీంనగర్ జిల్లా: దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు ఈనెల అక్టోబర్ 12వ తేదీలోగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నందు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిస్థాయిలో నియమ నిబంధనలు మరియు రక్షణ చర్యలు చేపట్టిన వారికే అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. బాణసంచా విక్రయాలు జరిపే వ్యాపారులు వివిధ ప్రభుత్వ శాఖల నిరభ్యంతర పత్రాలు పొందిన తర్వాతే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలోని భద్రత చర్యలు పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తు చేసుకునే వ్యాపారులు దరఖాస్తు ఫారంతోపాటు ఆధార్ కార్డు, వారి వారి పదవ తరగతి మెమో, 600 రూపాయల చలాన్ ను జతచేస్తూ, ఐదు సెట్స్ ల జిరాక్స్ కాపీలను ను పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు అందజేయాలని సూచించారు. ఈనెల 12వతేదీ తర్వాత అందజేసే దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ప్రజలు నివసించే ప్రాంతాలు, వివిధ దుకాణాల వద్ద మరియు ఇతర ప్రదేశాలలో చట్టాన్ని అతిక్రమించి బాణసంచా విక్రయాలకు పాల్పడితే ప్రజల రక్షణకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున అట్టి వ్యాపారులపట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.