కరీంనగర్ జిల్లా: రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న డైట్ చార్జీలను 50 శాతం వరకు పెంచాలని మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రాలు సమర్పించారు.
వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు డైట్ చార్జీలను 2017లో సవరించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చార్జీలను చెల్లిస్తున్నారని డాక్టర్ కవ్వంపల్లి ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలు, కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఈ రోజుల్లో కూడా చార్జీలు పెంచకపోవడం అన్యాయమని వారు వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 3 నుండి 7 తరగతుల విద్యార్థులకు నెలకు ఇస్తున్న 950 రూపాయలను 1,425 రూపాయలకు పెంచాలని, అలాగే 8 నుండి 10 తరగతుల విద్యార్థులకు ఇస్తున్న 1,100 రూపాయలను 1,650 రూపాయలకు,ఇంటర్మీడియట్,ఆ పైస్థాయి విద్యార్థులకు చెల్లిస్తున్న 1,500 రూపాయలను 2,250 రూపాయలకు పెంచాలని ఆయన కోరారు. చార్జీలు పెంచక పోతే నాసిరకం ఆహార పదార్థాలు అందించే అవకాశం ఉంటుందని, దీంతో విద్యార్థుల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
డైట్ చార్జీలు పెంపుదల వల్ల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చని, దీంతో జీవన నాణ్యత, ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు,సంక్షేమ హాస్టళ్లలో చదివేది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని వారు గుర్తు చేశారు. తక్షణమే చార్జీల పెంపదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. దీనికి ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.