కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గంలో వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మంచినీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గం లో వేసవి కాలంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమస్యాత్మ గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా జరిగేందుకు,నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ (ఇంట్రా ) కార్యనిర్వాహక ఇంజినీర్ అంజన్ రావు, ఉప ఇంజినీర్ సూర్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
