కరీంనగర్ జిల్లా: క్రీడల వల్ల ఐక్యత భావాన్ని పెంపొందించడం సాధ్యపడుతుందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని ఎస్సారెస్పీ మైదానంలో చింతగుట్ట గ్రామానికి చెందిన దివంగత కరివేద సదాశివరెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల ప్రగతికి తోడ్పాటు అందించిన సదాశివరెడ్డి పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ముదావహమని పేర్కొన్నారు. రైతుల విషయంలో ఆయన చూపించే శ్రద్ధ, తోడ్పాటు అందరికీ స్ఫూర్తివంతమన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు, యువతి యువకుల్లో ఐక్యమత్యాన్ని పెంపొందించవచ్చన్నారు. ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ లు యువకుల్లో ఐక్యతను పెంచుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ టోర్నమెంట్లు విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ టోర్నమెంట్ విజేత మొగిలిపాలెం జట్టుకు, రన్నరప్ తురకల మద్దికుంట జట్టుకు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ కప్పుతోపాటు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోపగాని సారయ్య, మాజీ మండలాధ్యక్షుడు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, హుజరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి పార్టీ నాయకులు కీసర సంపతి, బండారు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.