- అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
- ధర్మబావి నిర్మాణానికి హామీ
- జగ్గయ్యపల్లి గ్రామ సందర్శనలో ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి
కరీంనగర్ జిల్లా: ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తామని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసి వారి చింతను తీరుస్తామన్నారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు సామూహిక మంచినీటి బావి (ధర్మ బావి) నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి కావల్సిన సౌకర్యాలు సమకూరుస్తానని, సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించారు. స్మశాన వాటిక (వైకుంఠ ధామం)కు సరైన దారి లేకపోవడం అంతిమ సంస్కారాల సమయంలో ఇబ్బందులకు గురికావల్సి వస్తున్నదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టి తీసుకు రాగా, ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అంతేకాకుండా వీవో,కులసంఘాల భవనాలు, సీసీ రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లాఉపాధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఎం.మల్లయ్య, ఆర్. తిరుమల్ రెడ్డి, కనుకం అశోక్, కోండ్ర సురేష్, దేవేంద్ర,మడుపు ప్రవీణ్ కుమార్, రామిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.