- నిధుల మంజూరుకు మంత్రి కోమటిరెడ్డి హామీ
- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వెల్లడి
కరీంనగర్ జిల్లా: రోడ్లు, భవనాలశాఖ ద్వారా మానకొండూర్ నియోజకవర్గం లో వంద కోట్ల రూపాయలతో కొత్త పనులు చేపట్టనున్నట్టు మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులే కాకుండా కొత్త పనులకు నిధుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తి చేయించాలని కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఛాంబర్ లో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి వినతిపత్రం అందజేశారు. మానకొండూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని, గతంలో మంజూరై పెండింగ్ లో ఉన్న పనులతోపాటు కొత్త పనులకు నిధులు మంజూరు చేయాలని డాక్టర్ కవ్వంపల్లి మంత్రిని కోరారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులు,అందుకు అవసరమైన నిధులు తదితర అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సుదీర్ఘంగా చర్చించారు. మానకొండూర్ నియోజకవర్గం లో గతంలో మంజూరైన పనులు చాలావరకు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయని, ఆ పనులను వెంటనే చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాటిని పూర్తి చేసేలా చూడాలని ఆయన మంత్రిని కోరారు. మానకొండూర్ నియోజకవర్గంలో వర్షాకాలంలో కాజ్ వే లపై వరద నీరు ప్రవహించి చాలా గ్రామాలకు, మండలాలకు రాకపోకలు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వర్షా కాలంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హై లెవెల్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ మొదటి దశలో 100 కోట్ల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ పనులు పూర్తి చేసేలా అధికారులతో మాట్లాడుతానని మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినప్పుడు ఎమ్మెల్యే వెంట ఇల్లంతకుంట మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ఊట్కూరి వెంకటరమణారెడ్డి ఉన్నారు.