కరీంనగర్ జిల్లా: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాలలో పీఎం శ్రీ నిధులచే ఏర్పాటుచేసిన ఫ్రీ ప్రైమరీ తరగతి గదిని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంశ్రీ కింద 22 పాఠశాలలు ఎంపిక అయ్యాయని అందులో చిన్న మూల్కనూరు పాఠశాల ఒకటని గుర్తు చేశారు. పీఎం శ్రీ నిధులను సక్రమంగా వినియోగించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. మండలంలోని ఆయా గ్రామాలలో గల ఫ్రీ ప్రైమరీ మరియు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా విద్యాధికారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి పావని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రబియ బసిరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు భవాని, ఉపాధ్యాయులు శ్రీనివాస్, పద్మ, లావణ్య,సిఆర్పి శ్రీవాణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
